అధికార లంఛనాలతో పారికర్‌ అంత్యక్రియలు

SMTV Desk 2019-03-18 13:27:55  Parrikar, crimation, goa

గోవా: మనోహర్‌ పారికర్‌ గత కొంతకాలంగా క్లోమగ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతు ఆదివారం సాయంత్రం 6.40గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా, మూడేళ్లపాటు రక్షణ శాఖ మంత్రిగా సేవలందించారు. నిరాడంబరత, నిజాయతీకి నిలువుటద్దంగా, మితవాద నేతగా ప్రశంసలు అందుకున్నారు. పారికర్ అంత్యక్రియాలను ఇవాళ సాయంత్రం 5 గంటలకు అధికార లాంఛనాలతో నిర్వహించేందకు అవసరమైన ఏర్పాట్లను చేయమని కేంద్ర హోంశాఖ.. రక్షణశాఖను ఆదేశించింది. పారికర్ అంత్యక్రియలు మిరామర్‌ బీచ్‌లో గోవా తొలి సిఎం దయానంద్ బండోద్కర్ స్మారకం పక్కనే నిర్వహించనున్నారు.

మనోహర్‌ పారికర్‌ పార్థివదేహాన్ని ప్రస్తుతం పనాజీలోని బిజెపి కార్యాలయానికి తీసుకొచ్చారు. పార్టీ శ్రేణులు, ప్రజలు నివాళులర్పించిన అనంతరం కాలా అకాడమీకి తరలిస్తారు. అక్కడ నుంచి సాయంత్రం 4 గంటలకు పారికర్‌ అంతిమయాత్ర ప్రారంభం కాగా.. 5 గంటలకు మిరామర్‌ బీచ్‌లో అంతిమ సంస్కారాలు జరుగుతున్నట్టు బిజెపి నాయకులు వెల్లడించారు. పారికర్‌ అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరవుతున్నారు.