తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్; 21, 24 తేదీల్లో నామినేషన్లు బంద్!!

SMTV Desk 2019-03-18 09:17:22  elections, nominations notification, polling staff, nomination dates

అమరావతి, మార్చి 18: లోక్‌సభ ఎన్నికల్లో తొలి ఘట్టానికి నేడు తెరలేవనుంది. సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అయితే, 21న హోలీ, 24న ఆదివారం కావడంతో ఆ రెండు రోజుల్లోనూ నామినేషన్ల స్వీకరణ ఉండదు. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 27, 28 రెండు రోజుల్లో నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించి మే 23న ఫలితాలు విడుదల చేస్తారు.

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. 1,85, 560 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననుండగా, 94, 991 ఈవీఎంలను ఉపయోగించనున్నారు. 41,356 వీవీపాట్ యంత్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల కోసం ఏకంగా 270 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించనున్నారు.

ఇక, ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం.. 2.95 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటు హక్కు లేని వారు నమోదు చేసుకునే అవకాశం ఇక లేదు. ఈ నెల 15తోనే అది ముగిసింది. తుది జాబితాను ఈ నెల 25న ప్రకటించనున్నారు.