వేధింపులు వద్దంటే....చంపేస్తారా?

SMTV Desk 2017-08-09 13:54:19  YCP youth Leader, Nellore, Murder,

చిత్తూరు, ఆగస్ట్ 9: చిత్తూరు జిల్లాలో మంగళవారం రాత్రి దారుణ హత్య చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మండల వైసీపీ యూత్ లీడర్‌గా పనిచేస్తున్న పెద్దమండ్యం పాతవూరు జెండామాను వీధికి చెందిన కాలవగడ్డ హుసేన్‌బేగ్ కుమారుడు సత్తార్‌బేగ్ (35) హత్యకు గురి అయ్యాడు. సత్తార్‌బేగ్ బావమరిది ఇమ్రాన్ అదే ఊరిలో ఓ దుకాణం నడుపుతున్నాడు. ఇమ్రాన్ బంధువుల కమార్తె కళాశాలకు వెల్లే సమయంలో అదే గ్రామానికి చెందిన హర్షవర్ధన్, అతడి తమ్ముడు విష్ణు, మరో యువకుడు కోటిమణి కలిసి తనని వేధించేవారు. కాగా, ఈ విషయం తెలిసిన ఇమ్రాన్ వారిని చాలా సార్లు మందలించడం జరిగింది. దీంతో ఇమ్రాన్ పై కక్ష కట్టిన ఆ యువకులు మద్యం తాగి మంగళవారం అతనిపై దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటనపై యువకులను ప్రశ్నించేందుకు ఇమ్రాన్ తన బావమరిది సత్తార్‌ను తీసుకుని వెళ్లాడు. సత్తార్ వారిని ప్రశ్నించగా వారు అతన్ని కత్తితో ఛాతీపై పొడిచారు. దీంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సత్తార్ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.