యాప్ తో పార్కింగా?

SMTV Desk 2017-08-09 12:26:59  Parking, Smart phone App, Bangalore, BBMC,

బెంగుళూరు, ఆగస్ట్ 9: మహానగరాల్లో స్వంత వాహనాల్లో బయటకు వెళ్లాలంటే ఎన్నో సమస్యలు అందులో మొదటగా గుర్తు వచ్చేది పార్కింగ్ సమస్య. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు బీబీఎంపీ (బృహత్ బెంగుళూరు మహానగర పాలిక) సరికొత్త స్మార్ట్ ఫోన్ యాప్ ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా మీరు వెళ్లాలని అనుకుంటున్న ప్రాంతంలో ఎక్కడ పార్కింగ్ సదుపాయం ఉందన్న విషయంతో పాటు, అక్కడ స్థలాన్ని ముందుగా బుక్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తుంది. పార్కింగ్ సులభతరం చేయాలని యోచిస్తున్న బీబీఎంపీ, బెంగుళూరులోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌ లో 85 పార్కింగ్ స్థలాలు గుర్తించి, వాటి నిర్వహణ కోసం టెండర్ల ప్రక్రియను నిర్వహించింది. ఈ విధానం ద్వారా వాహనం పార్కింగ్ చేసిన తరువాత వివరాలను నమోదు చేసి, వెండింగ్ మెషీన్ నుంచి టికెట్ తీసుకోవాల్సి వుంటుంది. తిరిగి వెళ్లేటప్పుడు అదే టికెట్ను మిషన్కు చూపితే, ఎంత చెల్లించాలన్న విషయాన్ని వెల్లడిస్తుంది. పార్కింగ్ స్థలాలను మూడు కేటగిరీలుగా గుర్తించి, గంటకు బైకులకు రూ. 5 నుంచి రూ. 15 వరకూ, కార్లకు రూ. 15 నుంచి రూ. 30 వరకూ ధరలను ఖరారు చేశామని అధికారులు వెల్లడించారు. ఈ విధానం పూర్తిగా అందుబాటులోకి వస్తే, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు చాలావరకు తలెత్తవని అభిప్రాయపడుతున్నారు.