సీఎంపై కేసు పెట్టిన మహిళ...విచారించలేమని కొట్టేసిన సుప్రీం

SMTV Desk 2019-03-16 12:31:23  Arunachal Pradesh, Chief Minister, Pema Khandu, supreme court

ఈటానగర్, మార్చ్ 16: అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండుపై ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై సీజేఐ రంజన్ గొగోయ్, దీపక్ మిశ్రా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ 2008లో జరిగిన ఈ ఘటనలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. అలాగే హైకోర్టును ఆశ్రయించి, ఆమెకు రక్షణ కల్పించాలని పోలీసులను సంప్రదించాలని సూచించింది. కాగా ఆ మహిళా సీఎం పేమా ఖండుపై ఈ విధంగా ఫిర్యాదు చేసింది. ‘నేను 15ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సీఎం పెమా ఖండు మరో ముగ్గురు నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో నేను పబ్లిక్ కాల్ ఆఫీసులో పనిచేస్తున్నాను. అప్పుడు ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. అది నమ్మిన నేను ఒకరోజు వారిని కలవడానికి వెళ్లాను. అప్పుడు నాకు కూల్‌డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చారు. అది తాగిన నేను స్పృహ తప్పిపోయాను. ఆ తర్వాత నలుగురు నాపై అత్యాచారం చేశారు’ అని పేర్కొంది. మహిళ చేస్తున్న ఆరోపణలను సీఎం పెమా ఖండించారు.