శవ రాజకీయాలు మానుకోవాలి..

SMTV Desk 2019-03-16 10:55:19  APCM, Viveka,

అమరావతి, మార్చ్ 16: మాజీ మంత్రి, జగన్‌ చిన్నాన్న వివేకానంద రెడ్డి మృతి పట్ల అనుమానాలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు ఆయన పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారులు, కడప జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు.

వైఎస్ వివేకానంద మరణ వార్త తనను కలిచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉండవల్లిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వైసీపీ నేతలు టీడీపీపై చేస్తున్న విమర్శలపై ఎదురుదాడి చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ కు చంద్రబాబు పలు ప్రశ్నలు సంధించారు.

వివేకా హత్య జరిగిన విషయం క్లియర్ గా తెలిసినప్పటికీ ..మొదట గుండెపోటు అని ఎందుకు నాటకాలు ఆడారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇదే విషయాన్ని జనాలను నమ్మించే ప్రయత్నం ఎందుకు చేశారు. మెదడు కూడా బయటికి వచ్చినంత పెద్ద గాయం జరిగినప్పటికీ హత్య అని కుటుంబ సభ్యులు ఎందుకు బయటకు చెప్పలేకపోయారు. రక్తపు మరకలు ఉన్న రూంను ఎవరు క్లీన్ చేశారు .. డెడ్ బాడీని బాత్ రూంలో నుంచి బెడ్ రూంలోకి ఎవరు తీసుకుపోయారు. ఉదయం లేని లెటర్ ..సాయంత్రానికి ఎలా తయారైంది. ఇందంతా సాక్షాలు తారుమారు చేసేందుకు చేసిన కుట్ర అని చంద్రబాబు ఆరోపించారు. ఒక కుటుంబ సభ్యుడు చనిపోయినా సాక్షాలు లేకుండా చేయాలని చూసిన తీరు చూస్తుంటే తనకు బాధేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు

హత్య రాజకీయాలు చేయడం వైసీపీ వాళ్లకు వెన్నెతో పెట్టిన విద్య అని చంద్రబాబు విమర్శించారు. ఇంత దారుణం చేసి ఈ హత్య టీడీపీ వారే చేశారనే నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు దయ్యబట్టారు. ఒక సారిపై నాపై ఆరోపణలు చేస్తారు..మళ్లీ లోకేష్ పేరు చెబుతారు..మరోసారి టీడీపీ నేతలు చేశారంటూ వైసీపీ వారు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో నిందితులు ఎవరైనా వదిలిపెట్టేది లేదు. ఇంత దారుణం చేసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు..ఇప్పుడు సీబీఐ అంటూ డ్రామాలు ఆడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. హత్య చేసిన తర్వాత ఆ సాక్షాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించడం దారుణం. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం దారుణమని వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించిన చంద్రబాబు పరోక్ష విమర్శలు సంధించారు.

వివేకానందరెడ్డి మృతిపై అత్యున్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరపాలని సూచించారు. దోషుల్ని వెంటనే అరెస్టు చేసి, నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని సీఎం అధికారులను సూచించారు. వివేకానంద రెడ్డి మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తంచేయడంపై అప్పటికప్పుడు డీజీపీ, ఇంటెలిజెన్స్‌, కడప జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు. వివేకా కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

వైఎస్‌ వివేకానంద అనుమానాస్పద మృతిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేస్తున్నట్లు కడప ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ వెల్లడించారు. అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఈ సిట్‌ ఏర్పాటైంది.