ఆ ఒక్కటి తప్ప అన్ని పదవులు వెతుక్కుంటూ వచ్చాయి: వెంకయ్య

SMTV Desk 2017-08-08 14:44:55  Venkaiah Naidu, BJP Minister, Tirupati, NDA Vice president, Nellore,

నెల్లూరు, ఆగష్ట్ 8: ఈ నెల 5వ తేదీన భాజపా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు భారీ మెజార్టీతో ఉపరాష్ట్రపతి ఎన్నికలలో విజయం సాధించిన విషయం తెలిసిందే. నెల్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఒక్క పదవి తప్ప మిగతా పదవులు అన్ని తనను వెతుక్కుంటూ వచ్చాయంటూ ప్రధానమంత్రి పదవి తప్ప మిగతా అన్ని పదవులూ తాను చేపట్టానన్న అర్థంలో ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప్రజలకు సేవ చేసే అదృష్టం లభించిందని, కృషి, పట్టుదల వల్లనే ఇన్ని పదవులు చేపట్టానని ఆయన అన్నారు. సోమవారం ఉదయం తిరుమలలో, ఆపై తిరుపతిలో, సాయంత్రం నెల్లూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థుల నూతన వసతి గృహాన్ని, 300 పడకల ప్రసూతి ఆస్పత్రిని ప్రారంభించి, మెడికల్‌ కళాశాల విదార్థులకు ట్యాబ్‌ లు అందించారు. మహిళలను గౌరవించడం భారత సంప్రదాయమని, వారికి అవకాశమిస్తే వారి సత్తా ఏంటో తెలుస్తుందని, ప్రతి ఒక్కరూ మహిళలపై ఆధారపడి బతుకుతున్న వారేనని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రి వెళ్లే రోజులు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 11వ తేదీన ఆయన ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.