వాట్సాప్ వినియోగదారులకు ఎస్బీఐ హెచ్చరిక

SMTV Desk 2019-03-14 09:35:27  Whatsapp, SBI

హైదరాబాద్, మార్చ్ 13: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తాజాగా ఓ హెచ్చరిక జారీచేసింది. వాట్సాప్ వినియోగిస్తున్న తమ కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ దొంగిలించి మోసాలకు పాల్పడతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఓ ప్రకటనలో పేర్కొంది.

బ్యాంకు వివరాల ప్రకారం, మొదట వాట్సాప్ లో వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ)లపై అవగాహన కల్పిస్తున్నట్టుగా ప్రచారం చేస్తారని, ఆ తర్వాత నమ్మకం కలిగిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత కొన్ని ప్రమాదకరమైన వెబ్ లింకులు పంపిస్తారని వివరించింది. ఆ లింకులు ఓపెన్ చేస్తే వాటిలోని యాప్ లు ఫోన్ లో తిష్టవేసి బ్యాక్ గ్రౌండ్ లో పనిచేస్తూ వినియోగదారుల ఫోన్ లకు వచ్చే ఓటీపీలను తస్కరిస్తాయని ఎస్బీఐ వివరించింది.

మరికొన్ని సంఘటనల్లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అప్ డేట్ పేరిట వినియోగదారుల నుంచి సమాచారం సేకరిస్తారని, వాళ్ల ఉచ్చులో పడిన వ్యక్తులకు అప్ గ్రేడ్ పేరిట వాట్సాప్ కు సందేశం వస్తుందని నమ్మబలుకుతారు. ఆ మెసేజ్ తో పాటు ప్రమాదకరమైన యూఆర్ఎల్ కూడా పంపుతారని, ఆ లింక్ పై క్లిక్ చేయగానే అందులో మాల్వేర్ ఫోన్ లో చేరి ఓటీపీలు దొంగిలించడం మొదలుపెడుతుందని ఎస్బీఐ వర్గాలు వివరించాయి. ఇలాంటి మోసాల పట్ల తమ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు దిశా నిర్దేశం చేసింది .