సబితా ఇంద్రారెడ్డి యూ టర్న్!

SMTV Desk 2019-03-13 13:31:04  sabita indrareddy, congress, trs, kcr, ktr, asaduddin owaisi

హైదరాబాద్, మార్చ్ 13: నాలుగైదు రోజుల క్రితం మాజీ హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టిఆరెస్‌లో చేరనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు బైటకు పొక్కడంతో సబిత జోక్యం చేసుకుని తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని వివరణ ఇచ్చారు. కాని తాజాగ సబితా ఇంద్రారెడ్డి తన కొడుకు కార్తీక్ రెడ్డితో కలిసి బుధవారం టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మధ్య వర్తిత్వంతో బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో అపాయింట్‌మెంట్ ఖరారైనట్లు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ నేతలు సైతం ఢిల్లీ స్థాయిలో ఆమెను బుజ్జగించి పార్టీలోనే కొనసాగేలా చర్చలు జరిపారు. కానీ అవి విఫలమయ్యాయి. ఎంఎల్‌సి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మంగళవారం మళ్ళీ అసదుద్దీన్ జోక్యం చేసుకుని సిఎం కెసిఆర్‌తో మాట్లాడి సబితను, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డిని టిఆర్‌ఎస్‌లోకి తీసుకునేలా చొరవ తీసుకున్నారు. సబిత కాంగ్రెస్‌ను వీడకుండా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్, సిఎల్‌పి నాయకుడు భట్టి, పార్టీ సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తదితరులు పలుమార్లు ఆమెతోచర్చలు జరిపారు. కానీ ఆమె తన కుమారుడు కార్తిక్‌రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ళ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని పెట్టిన షరతుకు కాంగ్రెస్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు.