ఎవరు ఎక్కువ డబ్బిస్తే వారికే టికెట్ ఇస్తున్నారు: చంద్రబాబు

SMTV Desk 2019-03-12 09:35:47  ysrcp, tdp, jagan, chandrababu, ap politics

అమరావతి, మార్చి 12: తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన వారు, ఇప్పుడు తిరిగి వెనక్కి వస్తామని అడుగుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఉండవల్లి ప్రజావేదికలో కార్యకర్తలతో మాట్లాడిన ఆయన........20 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్లా అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, నేడు, రేపు జరిపే సమీక్షల్లో అక్కడి నుంచి పోటీ చేసేవారిని కూడా ఖరారు చేస్తామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయాలని భావించే అభ్యర్థుల మధ్య వేలం పాట నిర్వహించి, ఎవరు ఎక్కువ డబ్బిస్తే, వారికి టికెట్ ఇస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ఐదేళ్లు ఎంతో శ్రమించామని, పేదలకు అందుతున్న సంక్షేమం కొనసాగాలంటే, మరోసారి తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి రావాలని అన్నారు. ఎన్నికల సమర శంఖారావం తిరుపతిలో పూరిస్తామని, ఎన్నికల ప్రచారాన్ని శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభిస్తామని అన్నారు. ప్రజాసేవే ప్రామాణికంగా తాను అభ్యర్థులను ఎంపిక చేశానని, వారిని గెలిపించే బాధ్యతలను ప్రతి కార్యకర్త తీసుకోవాలని సూచించారు. మరో ఒకటి, రెండు రోజుల్లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పారు.