అశోక్‌కు ఝలక్ ఇచ్చిన హైకోర్టు

SMTV Desk 2019-03-12 07:38:45  Ashok, High court,

హైదరాబాద్, మార్చ్ 11: తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించిన డేటా చోరీ వ్య‌వ‌హారంలో కీల‌క నిందితుడుగా ఉన్న ఐటీ గ్రిట్ సంస్థ అధినేత‌ అశోక్ కుమార్ ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

దీంతో ఇప్ప‌టికే తెలంగాణ పోలీసులు అశోక్ కుమార్‌కు నోటీసులు పంప‌గా, అశోక్ మాత్రం అజ్ఞాతంలోనే ఉండి హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు.

తెలంగాణ పోలీసులు త‌న‌కు నోటీసులు ఇవ్వ‌డాన్ని స‌వాల్ చేస్తూ.. త‌న పై పెట్టిన కేసును కొట్టివేయాల‌ని, హైకోర్టులో అశోక్ క్వాష్ పిటీష‌న్ దాఖాలు చేయ‌గా.. ఈ రోజు కోర్టులో విచార‌ణ జ‌రిగింది.

విచార‌ణ‌లో భాగంగా అశోక్ త‌ర‌పు న్యాయ‌వాది మాట్లాడుతూ.. ఈ కేసులో త‌న క్ల‌యింట్ అశోక్ కుమార్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, అస‌లు డేటా చోరీ వ్య‌వ‌హారం ఏపీకి సంబంధించింది కావున‌, ఏపీ పోలీసులే ఈ కేసును విచారించాల‌ని వాదించారు.

అయితే అశోక్ త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న‌తో ఏకీభ‌వించ‌ని కోర్టు క‌చ్చితంగా పోలీసుల నోటీసులకు వివ‌ర‌ణ ఇవ్వాల్సిందే అని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ సంద‌ర్భంగా ఈ కేసుకు సంబంధించి తదుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 20వ తేదీన వాయిదా వేసింది. మ‌రి కోర్టు ఆదేశాల‌తో అయినా అశోక్ తెలంగాణ పోలీసుల ఎదుట హాజ‌రు అవుతారో లేదో చూడాలి.