పుల్వామా దాడి ప్రధాన సూత్రధారి హతం?

SMTV Desk 2019-03-11 13:47:16  pulwama attack, jammu kashmir, crpf army, indian army, encounter, Mohammad Bhai

జమ్ముకాశ్మీర్, మార్చ్ 11: ఫిబ్రవరి 14న జమ్ముకాశ్మీర్ లోని పుల్వామా లో భారత సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం త్రాల్‌లోని పింగ్లిష్‌ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులో పుల్వామా దాడికి పథకం రచించిన ప్రధాన సూత్రధారి ముదాసిర్‌ ఆహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ హతమై ఉంటాడని విశ్వసిస్తున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. అయితే పింగ్లిష్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో భద్రతాసిబ్బంది ఆదివారం కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. వారు తనిఖీలు జరుపుతున్న సమయంలో ఓ ఇంట్లో దాగి ఉన్న ఉగ్రవాదులు భద్రతాబలగాలపైకి కాల్పులకు దిగారు. దీంతో ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు జైషే ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయని అధికారులు తెలిపారు. హతుల్లో ఒకరిని ముదాసిర్‌ అహ్మద్ ఖాన్‌గా పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడికి అహ్మద్‌ కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. పుల్వామా దాడిపై ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో అహ్మద్‌ ఖాన్‌ గురించి అనేక విషయాలు వెలుగుచూసినట్లు అధికారులు తెలిపారు. పుల్వామా దాడికి పేలుడు పదార్థాలను, వాహనాన్ని ఏర్పాటుచేసింది అహ్మద్‌ ఖానే.