కాంగ్రెస్ కు నో చెప్పిన మన్మోహన్!

SMTV Desk 2019-03-11 12:23:06  indian ex prime minister, manmohan singh, congress party, loksabha elections

న్యూఢిల్లీ, మార్చ్ 11: భారత దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాని ఈయనకు పంజాబ్‌ కాంగ్రెస్‌ యూనిట్‌…ఓ భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అమృత్‌సర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని కాంగ్రెస్ మన్మోహన్‌కు కోరగా...ఈ ఆఫర్ పట్ల ఆయన ఆసక్తి కనబరచకపోవడం గమనార్హం. 86 ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌ కాంగ్రెస్‌ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్టు కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. 2009 సాధారణ ఎన్నికల సమయంలోనూ అనారోగ్య సమస్యల కారణంగా ఆయన లోక్‌సభకు పోటీ చేయలేదు. 2014 సాధారణ ఎన్నికల్లో అమృత్‌సర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున అమరీందర్‌ సింగ్‌ పోటీ చేసి విజయం సాధించారు. అయితే 1991 నుంచి అసోం నుంచి మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. మన్మోహన్‌ రాజ్యసభ పదవీ కాలం ఈ సంవత్సరం జూన్‌ 14తో ముగియనుంది. ఇప్పటి వరకు మన్మోహన్‌ లోక్‌సభకు ఎన్నిక కాలేదు. 1999లో కాంగ్రెస్‌ పార్టీ తరపున దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసి మన్మోహన్‌ సింగ్‌ ఓడిపోయారు.