తెలంగాణ భవన్ లో నేడు తెరాస శాసనసభాపక్ష సమావేశం

SMTV Desk 2019-03-11 11:32:37  kcr, ktr, telangana bhavan, trs, loksabha elections, trs mla, mlc

హైదరాబాద్, మార్చ్ 11: ఈ రోజు తెలంగాణ భవన్ లో శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేకర్ రావ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రేపు జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడనున్నారు. టీఆర్‌ఎస్ నుంచి హోంమంత్రి మహమూద్‌ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. మిత్రపక్షంతో కలిసి ఐదు స్థానాలు కైవసం చేసుకొనేందుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం టీఆర్‌ఎస్‌కు ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఎమ్మెల్యే తమ ఓటుహక్కును సరిగా వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించనున్నారు. ఒక్కో ఎమ్మెల్సీకి ఏ జిల్లా ఎమ్మెల్యేలను కేటాయించిన విషయాన్ని కూడా తెలియజేయనున్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, ఈ నెల 18వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుండటంతో ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చేలా పార్టీ ఎమ్మెల్యేలు పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించనున్నారు. మరోసారి ఎమ్మెల్యేలకు లక్ష్యాలను గుర్తుచేయనున్నారు. సీఎం కేసీఆర్ హాజరయ్యే ఎన్నికల సభలపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే మొదటివిడుత పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాలు ముగియగా, రెండోవిడుత ఈ నెల 13న తిరిగి ప్రారంభంకానున్నాయి.