మిలియన్ మార్చ్ : నేటితో ఎనిమిదేళ్ళు పూర్తి

SMTV Desk 2019-03-11 07:46:02  telangana, andhrapradesh, special telangana, telangana formation, million march, hyderabad tank band, prof kodandaram

హైదరాబాద్, మార్చ్ 10: తెలంగాణ సాధన ఉద్యమ పోరాట చరిత్రలో మిలియన్ మార్చ్‌ది ఓ ప్రత్యేక స్థానం. 2011 మార్చి 10 న ప్రజలందరూ కలిసి ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని చుట్టుముట్టిన సంఘటన నేటితో ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకుంది. లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణ జనంతో ఆరోజు ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోయింది. మార్చ్‌ను నిర్వీర్యం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగించింది. జిల్లాల బార్డర్లలో పోలీసుల దిగ్భంధాలు, అడ్డంకులు, బ్యారికేడ్లు, ఇనుపకంచెలను ఏర్పాటు చేసింది. అయినా తెలంగాణ వాదులను ఆపలేకపోయాయి. హైదరాబాదు నగరమంతా పోలీసులు, పారామిలటరీ బలగాలు మోహరించినా ఫలితం లేకుండా పోయింది. ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టలేనంత పక్కాగా ప్లాన్ చేసుకున్నారు తెలంగాణ వాదులు. ఆనాడు ‘మిలియన్ మార్చ్’ ధాటికి పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహించక తప్పలేదు. ప్రొ. కోదండరాం ఆధ్వర్యంలో జేఏసీ ఒక రోజంతా చర్చించి మిలియన్ మార్చ్‌ను ఒక ర్యాలీ రూపంలో జరపాలని నిర్ణయించాయి. ప్రజల నుంచి మిలియన్ మార్చ్ ప్రచారానికి అపూర్వ స్పందన రావడంతో టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు కూడా కలసికట్టుగా కదం కదిపాయి. ఆ ఉద్యమం జరిగిన రోజు ఈరోజు కాబట్టి గుర్తు చేసుకున్నాం. అప్పటి గాయాలు నొప్పి పెట్టినా ఇప్పడవి తీయని జ్ఞాపకాలనే చెప్పాలి. ఏదీ ఊరికే రాదు అన్నట్టే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా ఊరికినే రాలేదు. ఎన్నో బలిదానాలు, ఉద్యమాలు, పోరాటాలు, వాటికి ధీటుగా సమైక్యాంధ్రవాదుల కుట్రలు కుతంత్రాలను పటాపంచలు చేసి తెలంగాణ రాష్ట్రం అవతరించింది.