ఈ సినిమా ద్వారా మహిళలందరికి న్యాయం జరుగుతుంది : లక్ష్మీపార్వతి

SMTV Desk 2019-03-11 07:23:59  lakshmi ntr, ram gopal varma, lakshmi parvati

హైదరాబాద్, మార్చ్ 10: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ . ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ...“నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఎంతో నిజాయితీగా ఈ సినిమా తీశాం. ఈ చిత్రం కోసం కొంత మందిని కలిసి నిజాలను తెలుసుకున్నాను. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చాక ఏం జరిగిందనేది ఈ చిత్రంలో చూపించాం. అప్పుడు జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించడం జరిగింది. ఈ సినిమా తీయడానికి నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ. ఆయనకు ఈ సినిమాను అంకితమిస్తున్నా”అని అన్నారు. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ “23 సంవత్సరాలుగా ఒక స్త్రీ నిరంతర వేదన, అవమానాలను గుండెల్లో పెట్టుకొని తన భర్తకు జరిగిన అవమానం గురించి బాధపడుతూ, కుమిలిపోతూ ఎవరు న్యాయం చేస్తారా? అని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఆర్‌జివి రూపంలో న్యాయదేవత నా ముందు ప్రత్యక్షమైంది. ఆర్‌జివి వ్యక్తిత్వం గురించి విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ సినిమా ద్వారా ఈ సమాజంలో ఏ ఒక్కరూ చేయలేని న్యాయం ఆయన చేస్తున్నారు. ఇది ఒక లక్ష్మీపార్వతికే కాదు మహిళలందరికీ న్యాయం జరిగినట్లే”అని చెప్పారు.