సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ వీడనున్నారా...?

SMTV Desk 2019-03-10 14:19:15  Sabitha Indra Reddy, KTR, Secrete Meeting, Party Changing, Karthik Reddy, Congress, TRS

హైదరాబాద్, మార్చి 10: మరోసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ షాక్ కు గురవుతుందా? ఆ పార్టీ కీలక నేత, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో రహస్యంగా సమావేశం అయినట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజేంద్రనగర్ టికెట్ దక్కకపోవడంతో సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

అయితే కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతో సబితా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆమె టీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి సిద్దమైనట్లు సమాచారం. కాగా, సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు వీలుగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్యవర్తిత్వం నడిపారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆత్రం సక్కు, రేగ కాంతారావు, లింగయ్య సహా పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో సబిత కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేయడం ఆ పార్టీకి గట్టి దెబ్బ తగలనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుండి పోటి చేసి, గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై 9,227 ఓట్ల తేడాతో ఆమె ఘన విజయం సాధించారు.