ప్రారంభమైన ‘మా’ పోలింగ్..ఫిలిం చాంబర్ వద్ద సందడి

SMTV Desk 2019-03-10 12:07:37  Chiranjeevi, Nagababu, Shivaji

హైదరాబాద్ మార్చి10: సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్- ప్రస్తుత మా అధ్యక్షుడు శివాజీ రాజా ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా కనిపించడం లేదు. ఈ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ప్రముఖులు ఒక్కొక్కరే ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. మొత్తం 745 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంతో ఫిలిం చాంబర్ వద్ద సందడి నెలకొంది. నేటి సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రాత్రి కల్లా తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.

కాగా, గత కొన్ని రోజులుగా శివాజీ రాజా- నరేశ్ ప్యానెళ్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, తమ మద్దతు నరేశ్ ప్యానెల్‌కేనని మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని, కొందరి బలవంతం మీదే బరిలోకి దిగుతున్నట్టు శివాజీ రాజీ ఇది వరకే ప్రకటించాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఎంతమాత్రమూ లేదని శివాజీ రాజా పేర్కొన్నాడు.