జగన్ ఆదేశిస్తే జయదేవ్ పై పోటి చేస్తా...!

SMTV Desk 2019-03-09 16:06:10  Modugula Venugopal Reddy, Jaganmohan Reddy, Vijayasai Reddy, Galla Jayadev, TDP, YCP, Party Changing, MP

అమరావతి, మార్చి 9: గత నెల రోజులుగా వైసీపీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు టీడీపీ నాయకుడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఈరోజు ఆ పార్టీలో చేరారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డితో కలిసి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నివాసాని వెళ్ళిన మోదుగుల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మోదుగులకు పార్టీ కండువా కప్పి జగన్ ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందే తన ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి మోదుగుల రాజీనామా సమర్పించారు.

తరువాత మోదుగుల మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని మోదుగుల తెలిపారు. జగన్ ను సీఎం చేసేందుకు ఓ సైనికుడిలా పనిచేస్తానని వ్యాఖ్యానించారు. టీడీపీ నేత గల్లా జయదేవ్ గుంటూరుకు గెస్ట్ లాంటివారని విమర్శించారు. జయదేవ్ గుంటూరుకు రావడం, పోవడం తప్పితే ఓ పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఎన్నడూ వ్యవహరించలేదని దుయ్యబట్టారు. జగన్ ఆదేశిస్తే గుంటూరు లోక్ సభ స్థానం నుండి గల్లా జయదేవ్ పై పోటీ చేస్తానని స్పష్టం చేశారు.