పత్రాలు దొంగిలించలేదు, కేవలం ఫొటోకాపీలను మాత్రమే తీసుకెళ్ళారు

SMTV Desk 2019-03-09 10:16:57  Attorney General Venugopal, Rafale Deal Documents, Xerox, Ranadeep Surjevala, Congress

న్యూఢిల్లీ, మార్చి 9: ఇటీవలే రక్షణ శాఖ కార్యాలయం నుండి రఫేల్ ఒప్పంద పత్రాలు మాయం అయ్యాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్ట్ కు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో మరో మార్పు వచ్చింది. రక్షణ శాఖ కార్యాలయం నుండి కేవలం ఫొటోకాపీలను మాత్రమే తీసుకెళ్లారని, నిజమైన పత్రాలు రక్షణ శాఖ కార్యాలయంలోనే ఉన్నాయని అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ మాటమార్చారు. "రక్షణశాఖ నుండి రఫేల్‌ ఒప్పంద పత్రాలు అదృశ్యమయ్యాయని నేను సుప్రీంకోర్టుకు చెప్పినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని తెలిసింది. ఇది ఎంత మాత్రం నిజం కాదు. యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీ, ప్రశాంత్‌ భూషణ్‌ దాఖలుచేసిన పిటిషన్‌కు రఫేల్‌ ఒప్పంద పత్రాల ఫొటోకాపీలను జతచేశారు" అని స్పష్టం చేశారు.

ఈ విషయం పట్ల కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా స్పందిస్తూ, "మోదీ ప్రభుత్వపు ఏజీకి రఫేల్‌ పత్రాల దొంగతనం, ఫొటోకాపీలకు మధ్య వ్యత్యాసం తెలియదు. భారత్‌ సురక్షితమైన చేతుల్లో ఉందని ఆ ప్రభుత్వమే ప్రజలకు హామీ ఇస్తోంది. మోదీజీ ఈ మోసం ఏంటి? ఇప్పటివరకూ అనితరసాధ్యమైన అబద్ధాలన్నీ ఇప్పుడు సుసాధ్యంగా కనిపిస్తున్నాయి" అంటూ ఎద్దేవా చేశారు.