గోవాలో బీజేపీ పోయినట్టే రఫేల్ పత్రాలు పోయాయి...

SMTV Desk 2019-03-09 10:15:24  Rahul Gandhi, Manohar Parikar, Narendra Modi, Anil Ambani, Rafale Deal, Documents Missing

న్యూఢిల్లీ, మార్చి 9: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రఫేల్ డీల్ పై మరోసారి ధ్వజమెత్తారు. రఫేల్ డీల్ పత్రాల మాయంపై విచారణ అప్పటి రక్షణ శాఖ మంత్రి, ఇప్పటి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్‌ నుండే ప్రారంభించాలని అన్నారు. రాహుల్ గాంధీ శుక్రవారం జరిగిన పార్టీ బూత్‌ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ, గోవాలో బీజేపీ ప్రభుత్వం ఉనికిలో లేకుండా పోయినట్టే రఫేల్‌ పత్రాలు కూడా మాయమయ్యానని ఎద్దేవా చేశారు. "ఆ పత్రాలు తన వద్దే ఉన్నాయంటూ గతంలో పరీకరే చెప్పారు. అందుకే వాటి కోసం సాగే దర్యాప్తు పరికర్‌ నుంచే ప్రారంభం కావాలి" అని అన్నారు. అయితే, పరీకర్‌ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వం రఫేల్ ఒప్పందం కుదుర్చుకుంది.

ఇటీవల ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు కనిపించకుండా పోయాయి అంటూ కేంద్రం సుప్రీమ్ కోర్ట్ కు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ రఫేల్ డీల్‌ ద్వారా అనిల్‌ అంబానీకి లబ్ది చేకూర్చే పనిలో అధికారుల స్థాయి చర్చలను పట్టించుకోకుండానే ఒప్పందం సిద్ధం చేశారని రాహుల్‌ ఆరోపించారు. యూపీఏ హయాంలో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసి, రూ.30వేల కోట్ల మేర అంబానీకి లాభం చేకూర్చేందుకు మోదీ కాంట్రాక్టు సిద్ధం చేశారంటూ ఓ ఆంగ్ల పత్రికలో కథనం వచ్చిందన్నారు.