తన తండ్రి కలను నెరవేర్చబోతున్న బాలీవుడ్‌ దర్శకుడు

SMTV Desk 2019-03-08 18:55:09  bollywood, Karan johar, kalank,

ప్రముఖ బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ మరో భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “కళంక్” పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆలియా భట్‌, వరుణ్‌ ధావన్‌ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-లుక్‌ను కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఓ వ్యక్తి నావ నడుపుతుంటే.. అతని ముందు ఓ యువతి కూర్చున్నట్లుగా ఉన్న ఈ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ యువతి ఆలియా భట్‌ అయివుంటుందని అభిమానుల సందేహం. ఈ లుక్‌ను విడుదల చేస్తూ కరణ్‌ తన తండ్రి యశ్‌ జోహార్‌ను గుర్తుచేసుకున్నారు.

"15 ఏళ్ల క్రితం నా హృదయంలో పుట్టిన చిత్రమిది. నా తండ్రి చివరిసారిగా ఈ సినిమా కోసమే పనిచేశారు. ఈ సినిమా ఎప్పటికైనా ప్రేక్షకుల ముందుకు రావాలన్నది ఆయన కల. ఆయన బతికున్నప్పుడు నేను ఆ ఆశను నెరవేర్చలేకపోయాను. కానీ ఈరోజు ఆయన కలను నెరవేర్చేందుకు తొలి అడుగు వేశాను. అభిషేక్‌ వర్మన్‌ ఈ సినిమాను చాలా అందంగా తెరకెక్కించారు. 1940ల నేపథ్యానికి చెందిన చిత్రమిది. ఈరోజు నుంచి ఈ సినిమా ప్రయాణం మొదలుకాబోతోంది. మీరూ ఈ అమర ప్రేమకథలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నా” అని పేర్కొన్నారు. ఇందులో మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ దత్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్‌ కపూర్‌లు కూడా నటించారు. త్వరలో ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్.. జాఫర్‌ అనే పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. కళ్లకు కాటుకతో కోపంగా చూస్తున్నట్లుగా ఉన్న ఆయన లుక్‌ ఆకట్టుకుంటోంది.