రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది : కవిత

SMTV Desk 2019-03-08 18:23:44  trs mp kalvakuntla kavita, international womens day

హైదరాబాద్, మార్చ్ 08: శుక్రవారం హైదరాబాద్ యూసుఫ్ గూడా లోని చిన్న, మధ్య, సూక్ష్మ తరహా ఉత్సాహిక పారిశ్రామికుల శిక్షణ కేంద్రంలో లో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయస్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ...మహిళలు కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదని అన్నారు. ప్రతి మహిళ తానూ, తన కుటుంబం ఉన్నత స్దాయికి ఎదగాలని కలలు కంటారు..అయితే ఈ కల సాకారం కావడంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయని, వీటిని ధైర్యంగా ఎదుర్కోవాల్సింది మనమేనన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా క్లస్టర్ ఏర్పాటు చేసి ప్రోత్సాహం అందించాలనీ కోరారు. అయితే ఆదాయపు పన్ను మినహాయింపును మహిళా పారిశ్రామికవేత్తల కోరుతున్నారని, దీన్ని పరిశీలించాలని అన్నారు. అలాగే ఐటీ సెజ్ లలో మహిళల ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. తెలంగాణలో 42 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారని, వారికి మరింత ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని ఆమె అన్నారు. అలాగే మహిళా పారిశ్రామిక వేత్తల కోసం వి హబ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. వి హబ్ ను నాలెడ్జి పార్టనర్ గా కేంద్రం తీసుకుంటే తెలంగాణ బిడ్డలకు పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయని తెలిపారు. దేశంలో మహిళలు పారిశ్రామిక రంగంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాక బ్యాంకులు లోన్లు సకాలంలో ఇవ్వకుండా మహిళలను ఇబ్బంది పెడుతున్నాయని, ఈ విషయమై బ్యాంకర్లు తమ ఆలోచన ధోరణిని మార్చుకుని మహిళలకు విరివిగా రుణాలను ఇవ్వాలని ఆమె కోరారు. మహిళలు సంఘటితంగా ఉంటే, భవిష్యత్ లో పురుషులు పురుషుల దినోత్సవం జరుపుకునే రోజులు వస్తాయని కవిత చమత్కరించారు. తెలంగాణలో మహిళలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. మహిళా పారిశ్రామిక వేత్తలను రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నదనీ కవిత చెప్పారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడంలో ఎదురవుతున్న ఇబ్బందులు గుర్తించి, వారికి ప్రోత్సాహం అందిస్తున్నదని కవిత తెలిపారు.