మంత్రి ఓటే గల్లంతైతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి : ఎన్ఎండీ ఫరూక్

SMTV Desk 2019-03-08 18:08:38  nmd farooq, ap minister, data scam case, tdp, ysrcp, chandrababu, ys jagan mohan reddy

కర్నూలు, మార్చ్ 08: ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తాజాగా ఓట్ల గల్లంతు కేసు వ్యవహారంపై స్పందించారు. కర్నూలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన డేటా చోరీపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... దశాబ్దాల తరబడి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న తన ఓటు గల్లంతు కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఫరూక్ తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఓట్లను సైతం తొలగించారని విలపించారు. తమ ఓట్లు గల్లంతుపై అధికారులను సంప్రదిస్తే తమకు ఆ విషయం తెలియదని సమాధానం చెప్తున్నారంటూ మండిపడ్డారు. ఓట్ల తొలగింపు వెనుక వైసీపీ కుట్ర ఉందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆరోపించారు. ఎన్నికల్లో ఎనిమిది సార్లు పోటీచేసిన తన ఓటే గల్లంతైతే ఇక సామాన్య ప్రజల ఓట్ల పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశానని అయితే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారన్నారు.