మరో రికార్డు బ్రేక్ చేయబోతున్న ధోని

SMTV Desk 2019-03-08 12:38:43  mS Dhoni,

రాంచి, మార్చ్ 08: టీం ఇండియన్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు.భారత్ శుక్రవారం ఆస్ట్రేలియాతో కీలకమైన మూడో వన్డేలో తలపడనుంది. ధోని స్వస్థలం రాంచీలో ఈ మ్యాచ్‌ జరగనుంది. అక్కడే ధోని ఈ రికార్డ్ నెలకొల్పే అవకాశముంది.

అయితే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో ఇప్పటి వరకు ధోనీ 16,967 పరుగులు చేశాడు. 17,000 పరుగులకు కేవలం 33 పరుగుల దూరంలో ఉన్నాడు. రికార్డుకు అవసరమైన 33 పరుగులు చేస్తే సొంత గడ్డ రాంచీలో జరిగే వన్డే అతనికి చిరస్మరణీయం అవుతుంది. భారత జట్టు తరఫున ఇప్పటివరకు సచిన్‌ టెండుల్కర్ (34,357), రాహుల్‌ ద్రవిడ్‌ (24,208), విరాట్‌ కోహ్లీ (19,453), సౌరవ్‌ గంగూలీ (18,575), వీరేంద్ర సెహ్వాగ్‌ (17,253) ఇంతకు ముందే 17,000 పరుగుల మైలురాయి అధిగమించారు. ప్రస్తుతం ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 528 మ్యాచ్‌లు ఆడి 45 సగటుతో 16967 పరుగులు సాధించాడు. వాటిలో 16 శతకాలు, 106 అర్ధశతకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో జాదవ్‌తో కలిసి జట్టుకు విజయాన్ని అందించిన ధోనీ రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. రాంచీ వన్డేలో అతడు రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌ గెలిస్తే టీమిండియా 3-0తో సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.