టీడీపీకి మరో ఎదురుదెబ్బ, వైసీపీ గూటికి చేరిన దాసరి బాలవర్ధన్‌ రావు

SMTV Desk 2019-03-08 12:35:44  Dasari Balavardhan Rao, Jaganmohan Reddy, Party Changing, TDP, YCP

అమరావతి, మార్చి 8: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ఈరోజు ఉదయమే ఆ పార్టీ నేత చల్ల రామకృష్ణ రెడ్డి గుడ్ బాయ్ చెప్పారు. తాజాగా మరో నేత కూడా పార్టీ వీడనున్నాడు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కృష్ణా జిల్లా విజయ డెయిరీ డైరెక్టర్ దాసరి వెంకట బాలవర్థన్ రావు నేడు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ని కలిసి, ఆయన సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, బాలవర్థన్‌ రావు సోదరుడు దాసరి జై రమేష్‌ పాల‍్గొన్నారు. కాగా ఇప్పటికే దాసరి జై రమేష్‌, వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా బాలవర్ధన్‌ రావు మాట్లాడుతూ, గన్నవరం నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం భయంకర వాతావరణం నెలకొందని అన్నారు. గన్నవరంలో ప్రజల కష్టసుఖాలు చెప్పుకునే పరిస్థితి టీడీపీలో లేదని అన్నారు. కార్యకర్తల భవిష్యత్‌ కోసం తాను వైసీపీలో చేరినట్లు పేర్కొన్నారు. అయితే తాను ఎలాంటి హామీలు అడగలేదని దాసరి బాలవర్ధన్‌ రావు తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసేందుకు తాను సిద్ధమన్నారు.