అమెరికా అధ్యక్షుడికి 1001 రాఖీలు

SMTV Desk 2017-08-06 15:12:46  donald trump, narendra modi, raksha bhandan

గుర్‌గావ్, ఆగస్ట్ 6 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు రక్షాబంధన్ ను పురస్కరించుకొని హర్యానా మహిళలు రాఖీలు పంపిస్తున్నారు. వెనుకబడిన మెవాట్‌ ప్రాంతంలోని మరోరా గ్రామాన్ని సులభ్‌ అనే స్వచ్ఛంద సంస్థ దత్తత తీసుకుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఆ గ్రామ బాలికలు, మహిళలు అమెరికా అధినేతకు పెద్ద మొత్తంలో వెయ్యిన్నొక్క రాఖీలు పంపించడం విశేషం. కాగా ఇటీవల సులభ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ(ఎస్‌ఐఎస్‌ఎస్‌ఓ) అధినేత బిందేశ్వర్‌ పాఠక్‌ ఈ గ్రామానికి "ట్రంప్‌ గ్రామం" అని పేరు పెట్టారు. దీంతో ఆ ఊరి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. అయితే ఆ ఊరి పేరు నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ అధికారులు అభ్యంతరం తెలపడంతో ట్రంప్‌ గ్రామ సూచిక బోర్డులను తొలగించారు. ఈ పరిధిలో నివసించే గ్రామ జనాభా1800 ఉండగా ఇందులో ఎక్కువ మంది ముస్లిములే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లను గ్రామ మహిళలు తమ పెద్దన్నయ్యలుగా భావిస్తారని ఎస్‌ఐఎస్‌ఎస్‌ఓ ప్రతినిధులు తెలిపారు. అందుకని మోదీ ఫొటోలతో 501 రాఖీలను, ట్రంప్‌ ఫొటోలతో 1001 రాఖీలను తయారుచేసి పంపిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే కొందరు మహిళలు మోదీని కలిసి రాఖీలు కట్టేందుకు ఢిల్లీ బయలుదేరినట్లు తెలిపారు.