స్పెయిన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో విశాఖకు చెందిన యువకుడు మృతి

SMTV Desk 2019-03-07 16:46:49  shanmukh naidu died train accident in spain, train accidents, spain, vishakhapatnam

స్పెయిన్‌, మార్చ్ 07: విశాఖపట్నంకు చెందిన ఓ యువకుడు స్పెయిన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. అక్కడినుంచి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పూర్తి వివరాల ప్రకారం విశాఖలోని దుర్గానగర్‌లో నివాసం ఉంటున్న విశ్రాంత నేవీ ఉద్యోగి మజ్జి చిన్నంనాయుడు, మణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు డాక్టర్‌ హారిక, నీలిమ, కుమారుడు షణ్ముఖ్‌ నాయుడు సంతానం వున్నారు. తన ప్రతిభతో షణ్ముఖ్(పాస్‌పోర్టు నెంబర్‌: జెడ్‌3407688) స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోటోనిక్‌ సైన్సెస్‌ రీసోర్స్‌లో యువ శాస్త్రవేత్తగా చదువుకుంటున్నాడు. అయితే గత సోమవారం పోలీసులు అతని శవాన్ని రైల్వే ట్రాక్‌పై గమనించి, కళాశాలకు సమాచారం అందించారు. కళాశాల బృందం వెళ్లి షణ్ముఖ్ శవాన్ని చూసి నిర్ధారించుకున్న తరువాత అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మరణించిన సమయంలో వాకింగ్‌ ట్రాక్, టీషర్ట్‌తో షణ్ముఖ్‌ ఉన్నట్లు కళాశాల ప్రతినిధులు తెలిపారు. అయితే షణ్ముఖ్‌ ప్రమాదవశాత్తు మరణించాడా…? ఆత్మహత్యకు చేసుకున్నాడా ? లేక మరేదైనా కారణంతో మరణించాడా…? అన్న విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారత ప్రభుత్వం త్వరగా స్పందించి షణ్ముఖ్‌ మృతదేహాన్ని విశాఖకు రప్పించాలని అతని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.