సోషల్ మీడియాలకు కేంద్రం హెచ్చరికలు!

SMTV Desk 2019-03-07 12:09:33  election commission of india, central government, elections, social media, facebook, twitter, instagram

న్యూఢిల్లీ, మార్చ్ 06: దేశంలో ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు కట్టు దిట్టం చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఎన్నికలపై గట్టి ప్రభావం పడే అవకాశముంది. సోషల్ మీడియాలో రోజుకు సగటున కొన్ని వేల వార్తలు వస్తుంటాయి. అందులో ఏవి నిజమో...ఏవి ఫేక్ వార్తలో అర్ధం కావు. వీటి వల్ల చాల నష్టం వాటిల్లే అవకాశముంది. ఈ సందర్భంగా ఫేక్ వార్తలను కట్టడి చేసేందుకు దీటైన చర్యలు చేపట్టాలని ఐటీపై పార్లమెంటరీ కమిటీ కోరింది. ఎన్నికల కమిషన్‌తో సమన్వయంతో అసత్య వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సూచించింది. వివిధ సామాజిక మాధ్యమాల వేదికలపై యూజర్ల డేటా పరిరక్షణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా ఈ కమిటీ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సంస్థలను కోరింది. ఎన్నికల సమయంలో అసత్య వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తూ నివేదికలు అందించాలని అనురాగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఆయా సంస్థలను బుధవారం ఆదేశించింది. అసత్య వార్తలు సహా తలెత్తే పలు అంశాలను రియల్‌ టైమ్‌లో పరిష్కరించేందుకు ఆయా సంస్థలు సన్నద్ధం కావాలని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈసీతో సమన్వయంతో వ్యవహరించాలని సూచించింది. రాజకీయాలకు సంబంధించిన ప్రకటనల వ్యవహారంలో పారదర్శకతతో కూడిన విధానాన్ని సోషల్‌ మీడియా వేదికలు ప్రవేశపెట్టాలని కోరింది.