చెన్నై రైల్వే స్టేషన్ కు కొత్త పేరు...

SMTV Desk 2019-03-07 11:27:44  Narendra Modi, Kanchipuram Public Meeting, MG Ramachandran, Railway Station

చెన్నై, మార్చి 7: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటించారు. రాష్ట్రంలోని కాంచిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కాంచీపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ మేరకు ఆయన ప్రసంగిస్తూ, చెన్నై రైల్వే స్టేషన్ పేరును మార్చబోతున్నట్టు ప్రకటించారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ పేరును స్టేషన్‌కు పెట్టాలనుకుంటున్నట్టు తెలిపారు. ఆ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కి గ్రేట్ ఎంజీఆర్ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నామని ఆయన బహిరంగ సభలో ప్రకటన చేశారు.

తమిళ ఆత్మగౌరవ నినాదాన్ని లేవనెత్తిన మోడీ, తమిళనాడు నుండి బయలుదేరి వెళ్లే విమానాలు, తమిళనాడుకు ఇతర ప్రాంతాల నుండి వచ్చే విమానాల్లో తమిళ భాషలోనే ప్రకటనలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తరువాత ప్రతిపక్ష నేతలపై మండిపడ్డ మోదీ, వారందరూ తనను విమర్శించడంలో పోటీ పడుతున్నారని, తన కుటుంబంపై చెడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలే తమకు అధిష్ఠానమని, దేశ భద్రత విషయంలో తాము రాజీ పడబోమని ప్రధాని మరోసారి స్పష్టం చేశారు.