డేటా చోరీ కేసులో రంగంలోకి టీడీపీ...తెలంగాణ సర్కార్ పై కేసులు!

SMTV Desk 2019-03-06 18:05:25  datawar, it grid company, bhaskar, andhrapradesh police, telangana police, tdp

అమరావతి, మార్చ్ 06: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న డేటా చోరీ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుపై స్పందించిన టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెట్టాలని టీడీపీ నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రజలకు సంబంధించిన డేటాను చోరీ చేసిందని ఆరోపిస్తూ కేసు పెట్టాలని టీడీపీ నిర్ణయించింది. తమ పార్టీకి చెందిన వ్యక్తి కంపెనీలోకి తెలంగాణ పోలీసులు వెళ్లి డేటాను చోరీ చేశారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ప్రజలకు సంబంధించి వ్యక్తిగత భద్రతకు ఇబ్బందులు కలిగేలా ఎలాంటి డేటా తాము సేకరించలేదని టీడీపీ చెప్తోంది. అటు డేటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ కోర్టులో పరువు నష్టం దావా వెయ్యాలని కూడా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు ఏపీ ప్రభుత్వం పరువుకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది. ఈ రోజు సాయంత్రం లేదా గురువారం సాయంత్రం కేసులు పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంలో ఏపీ సర్కార్ డైరెక్ట్ అటాక్ కి దిగడంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. మరోవైపు పనిలోపనిగా వైసీపీని కూడా ఇరుకున పెట్టేందుకు టీడీపీ పావులు కదుపుతోంది.