ట్రంప్ నిర్ణయం వల్ల మాకేం నష్టం లేదు : భారత్

SMTV Desk 2019-03-05 15:34:31  india, america, america president donald trump, indian exports and imports, indian markets, anoop vadhavan

న్యూఢిల్లీ, మార్చ్ 5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువుల ఎగుమతులపై తీసుకున్న నిర్ణయం వల్ల మన దేశానికి ఎటువంటి నష్టం లేదని దేశ వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధవన్ అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... సాధారణ ప్రాధాన్యత వ్యవస్థ కింద భారత్‌ 5.6 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తుంది. ఈ ఎగుమతుల వల్ల భారత్‌కు ఏటా కేవలం 190 మిలియన్‌ డాలర్ల ప్రయోజనం చేకూరుతుంది. భారత్‌, అమెరకా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఎలాంటి ప్రభావం చూపించదు అని చెప్పారు. జిఎస్‌పి ద్వారా అమెరికా కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యత వాణిజ్య హోదా కల్పిస్తుంది. అందులో భారత్‌ ఒకటి. దీని ద్వారా అమెరికా మార్కెట్లలోకి కొన్ని వస్తువులను ఎలాంటి సుంకాలు లేకుండా ఎగుమతి చేసేందుకు మన దేశానికి వీలుంది. భారత మార్కెట్లలో అమెరికాకు నిష్పక్షపాత అవకాశాలు కల్పించడం లేదని, భారత్‌కు జిఎస్‌పి హోదాను తొలగించాలని ట్రంప్‌ ప్రతిపాదించారు. 60 రోజుల తర్వాత ఇది అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని యుఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ ఆఫీస్‌ వెల్లడించింది.