భారత్ పై ట్రంప్ సంచలన నిర్ణయం...!

SMTV Desk 2019-03-05 15:30:55  india, america, america president donald trump, indian exports and imports, indian markets

వాషింగ్టన్‌, మార్చ్ 5: భారత్ పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ సంచలన నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. దీని ప్రభావం వల్ల భారత్ కు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. ఇక విషయానికొస్తే....గతంలో భారత్‌ వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. కాని ఇప్పుడు ఎలాంటి సుంకాలు లేకుండా భారత వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసేందు వీలుగా ఆ దేశానికి ఇస్తున్న ప్రాధాన్యత వాణిజ్య హోదాను తొలగించాలని ట్రంప్ ఆలోచిస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులకు ట్రంప్‌ లేఖ ద్వారా తెలియజేశారు. ఈ చర్యతో భారత్‌, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ(జీఎస్‌పీ) కింద అమెరికా మార్కెట్లలో భారత్‌కు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నాం. భారత మార్కెట్లలోనూ మన దేశానికి అలాంటి సదుపాయాలు కల్పించాలని అమెరికా కోరినప్పటికీ.. భారత్‌ దానిపై స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు. అందుకే భారత్‌కు ప్రాధాన్యత వాణిజ్య హోదాను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నా అని యూఎస్‌ కాంగ్రెస్‌కు రాసిన లేఖల్లో పేర్కొన్నారు. జీఎస్‌పీ ప్రోగ్రామ్‌ కింద అమెరికా కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యత వాణిజ్య హోదా కల్పిస్తోంది. అందులో భారత్‌ ఒకటి. దీని ద్వారా అమెరికా మార్కెట్లలోకి కొన్ని వస్తువులను ఎలాంటి సుంకాలు లేకుండా ఎగుమతి చేసేందుకు మన దేశానికి వీలుంది. ఇప్పుడు ఆ హోదాను తొలగిస్తే.. భారత్‌ నుంచి ఎగుమతి చేసే అన్ని వస్తువులకు అమెరికా సుంకాలు విధిస్తుంది. దీని వల్ల దేశానికి భారీ నష్టం చేకూరే ప్రమాదం ఉంది.