ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకుని మాట్లాడాలి

SMTV Desk 2019-03-05 11:29:02  KTR, Chandrasekhar Rao, Uttham Kumar Reddy, Revanth Reddy, Chandrababu Naidu, Vishweshwar Reddy, Rajgopal Reddy, TRS, TDP, Congress

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ఇప్పటివరకు చేసిన తప్పులు చాలక ఇంకా తమనే విమర్శిస్తున్నారని నిప్పులు గుప్పించారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ సంక్షేమానికి, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి మాత్రమే తమ పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. తామేమీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి రావాలని ప్రలోభ పెట్టడం లేదన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఆపరేషన్ ఆకర్ష్ పేరిట కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు.

ఈ వ్యవహారాలను కేటీఆర్ గట్టిగా తిప్పికొట్టారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రేవంత్ రెడ్డిని ఎన్ని కోట్లు ఇచ్చి కొన్నారని ప్రశ్నించారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకున్నప్పుడు ఎంత డబ్బు ఇచ్చారో చెప్పి, ఆ తరువాత తమను ప్రశ్నించాలని సవాల్ విసిరారు. "కాంగ్రెస్‌ నేతలవి దురహంకార మాటలు. ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. ప్రజల్లో రాజకీయ వ్యవస్థను మనమే దిగజారుస్తున్నాం. కాంగ్రెస్‌ లో చేవ చచ్చిందని స్వయంగా రాజగోపాల్‌ రెడ్డి చెప్పారు. మాదారి మేమే వెతుక్కుంటామని ఆయనే అన్నారు. టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి పార్టీ మారినప్పుడు ఇదే ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పార్టీ మారారు. టీఆర్‌ఎస్‌ లో గెలిచిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌ లో చేర్చుకున్నప్పుడు ఎంతకు కొన్నారు?" అంటూ ప్రశ్నించారు.