టీడీపీకి మరో ఎదురుదెబ్బ, పార్టీని వీడనున్న చల్లా..!

SMTV Desk 2019-03-04 20:49:10  Challa Ramakrishna Reddy, Chandrababu Naidu, Jaganmohan Reddy, TDP, YCP, Party Changing

అమరావతి, మార్చి 4: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. గత కొద్దిరోజులుగా తెలుగు దేశం పార్టీకి ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆ పార్టీని వీడి వైసిపీలో చేరగా, తాజాగా మరో నేత కూడా పార్టీ మారనున్నట్లు సమాచారం. టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి తన ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం నాడు చంద్రబాబుకు పంపారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పౌర సరఫరాల కార్పొరేషన్ కు కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. కాగా, టీడీపీ నుంచి కర్నూలు జిల్లాలో ఏదైనా నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ను ఆశించిన ఆయన, తన కోరిక తీరే అవకాశాలు లేవన్న నిర్ణయానికి వచ్చి పార్టీకి దూరమైనట్టు తెలుస్తోంది. కాగా, చల్ల త్వరలోనే వైసీపీలో చేరనున్నట్లు, ఇప్పటికే ఈ విషయాన్ని తమ ముఖ్య అనుచరులకు ఆయన తెలియజేశారని సమాచారం. ఈ నెల 8వ తేదీన వైఎస్ జగన్ ను కలిసే చల్లా, ఆపై పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.