ఆ ముగ్గురికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

SMTV Desk 2019-03-04 20:02:18  Galla Jaidev, Dulipally Narendra, Dulipally Veeraiah, Alapati Rajendra Prasad, TDP, MP, MLA, Seats, BJP, Chandrababu Naidu

అమరావతి, మార్చి 4: లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోటీ పడే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. పార్లమెంట్ అభ్యర్ధిగా గల్లా జయదేవ్ మరోసారి పోటి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబు. అలాగే, పొన్నూరు నుండి నరేంద్రకు, తెనాలి నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు టికెట్ లను ఖరారు చేసినట్టు స్పష్టం చేశారు. గుంటూరు లోక్ సభ పై రెండు రోజుల పాటు సమీక్షలు నిర్వహించిన ఆయన, పార్లమెంట్ సీటు గల్లా జయదేవ్ కే అని స్పష్టం చేశారు. మిగతా నియోజకవర్గాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. టికెట్లు ఖరారైన నేతలు నియోజకవర్గాల్లోకి వెళ్లి ప్రచారం చేసుకోవాలని ఆదేశించారు.

అమెరికాలో విద్యాభ్యాసం చేసి, 2014లో తొలిసారిగా ఎంపీగా బరిలోకి దిగిన గల్లా జయదేవ్ విజయం సాదించి, లోక్ సభలో బీజేపీని ఎదురించడంలో గట్టిగా నిలిచి, సీఎం మనసు దోచుకున్నారు. ఇక ధూళిపాళ్ల వీరయ్య చౌదరి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన నరేంద్ర, ఇప్పటివరకూ వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ పై కన్నేశారు. సంఘం డెయిరీ చైర్మన్‌ గా, టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ శాసన సభ విప్‌ గానూ ఆయన విధులు నిర్వర్తించారు. అలాగే, తెనాలి ప్రాంతంలో ఆలపాటికి ప్రజల్లో మంచి మద్దతు ఉందని, మరోసారి ఆయనే కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు పలు సర్వేలు వెల్లడించడంతోనే ఆయనకు చంద్రబాబు టికెట్ ను ఖరారు చేశారని సమాచారం. 2014 ఎన్నికల్లో గుంటూరు తూర్పు, మంగళగిరి మినహా మిగతా అన్ని స్థానాలనూ తెలుగుదేశం పార్టీ గెలవగా, ఈసారి ఆ రెండింటిని కూడా గెలుచుకోవాలన్న లక్ష్యంతో చంద్రబాబు బలమైన అభ్యర్థులను బరిలోకి నిలపాలని భావిస్తున్నారు.