ధోని క్రీజులో ఉన్నంతసేపూ ప్రత్యర్థి జట్టు ఒత్తిడిలోనే ఉంటుంది : కేదార్ జాదవ్

SMTV Desk 2019-03-04 20:00:49  kedar jadav, ms dhoni

హైదరాబాద్ లో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్రతీకారం తెరుచుకుంది టీమిండియా. 237 పరుగులు ఛేదించే లక్ష్యంతో బరిలో దిగిన ఇండియా 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ కేదార్ జాదవ్ 81, ధోనీ 59 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినప్పటికీ జాదవ్, ధోనీల మెరుపు వేగం 100పరుగుల భాగస్వామ్యం సాధించటమే కాకుండా జట్టును విజయ తీరాలకు చేర్చింది.

ఈ నేపథ్యంలో కేదార్ జాదవ్ .. మహేంద్ర సింగ్ ధోని పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. అవతలి ఎండ్‌లో మహేంద్ర సింగ్‌ ధోని ఉంటే.. బ్యాటింగ్‌ చేసే ఆటగాడిలో ఉండే ఆత్మవిశ్వాసమే వేరని జాదవ్‌ అన్నాడు. ‘‘ధోని క్రీజులో ఉన్నంతసేపూ ప్రత్యర్థి జట్టు ఒత్తిడిలోనే ఉంటుంది. శనివారం మ్యాచ్‌లో ధోని తొడ కండరాలు పట్టేసి ఇబ్బంది పడ్డాడు. అతడి దగ్గరికెళ్లి ఒకటే చెప్పా.. ‘నువ్వు క్రీజులో ఉండు చాలు, అదే నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిస్తుంది’ అని. ధోనితో ఎప్పుడు సమయం గడిపినా చాలా నేర్చుకుంటాను. ధోనీని చూస్తే చాలు ఆత్మవిశ్వాసం వచ్చేస్తుంది. ఆ భావనను మాటల్లో వర్ణించలేను. ‘ఈ రోజు నేను ఆడతాను’ అనే నమ్మకం కలుగుతుంది. ప్రతి ఆటగాడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకోవడం ఎలాగో ధోనికి తెలుసు. అతడిలో నాకు నచ్చే విషయమదే’’ అని కేదార్‌ చెప్పాడు. ధోని, కోహ్లి తమ కెరీర్లలో ఎంతో సాధించారని, అందులో 10-15 శాతం తాను సాధించినా అదెంతో గొప్పే అవుతుందని అతనన్నాడు.