జూనియర్ ఎన్టీఆర్‌ పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్: టీడీపీ ఎమ్మెల్యే

SMTV Desk 2019-03-04 19:48:46  Metta Nageshwar Rao, Sandra Venkata Veeraiah, Chandrababu Naidu, Jr. NTR, TDP, Telangana

హైదరాబాద్, మార్చి 4: టీడీపీ నేత, ఖమ్మం జిల్లా అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టీడీపీకి రాబోయే రెండేళ్లలో కొత్త నాయకత్వం వస్తుందని తెలుపుతూ జూనియర్ ఎన్టీఆర్ పగ్గాలు చేపడతారని పేర్కొన్నారు.

జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరాలని వ్యూహాలు పన్నుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా స్పందించిన మెచ్చా నాగేశ్వరరావు తాను టీడీపీ విడిచి పెట్టనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నాయకులు తనను సంప్రదించారని, కానీ తను పార్టీని విడబోనని తెలిపారు.

తెలంగాణకు చెందిన మాజీ మంత్రులు, సీఎంఓ సహా పెద్ద పెద్ద వాళ్లు తనను పార్టీ మారాలని కోరిన మాట నిజమేనన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు.

"రెండేళ్లలో టీడీపీని బతికించుకుంటాం. ఆ తర్వాత డైమండ్ లాంటి లీడర్ వస్తారు. జూనియర్ ఎన్టీఆర్‌ రెండేళ్ల తర్వాత రాజకీయాల్లోకి వస్తానని చంద్రబాబుకు చెప్పారట. తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి కూడా అవుతాడు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రంపై చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. కేడర్‌ను ధైర్యంగా ఉండమని చెప్పారు." మెచ్చా అన్నారు.

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. ప్రస్తుతం తెలంగాణలో కేవలం టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు మాత్రమే గెలవగా, సండ్ర టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్దమయ్యారు.