ఏపీ పోలీసులు బెదిరిస్తున్నారు : లోకేశ్వర్ రెడ్డి

SMTV Desk 2019-03-04 17:20:23  datawar, it grid company, bhaskar, andhrapradesh police, telangana police, chandrababu, lokeshwar reddy

హైదరాబాద్, మార్చ్ 3: ఐటీ గ్రిడ్స్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఏపీ ఓటర్ల సమాచారం లీకైందని ఫిర్యాదు చేస్తే తనను ఏపీ పోలీసులు బెదిరిస్తున్నారని కూకట్‌పల్లికి చెందిన లోకేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గచ్చిబౌలిలోని సీపీ కార్యాలయంలో ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజల డేటా ప్రైవేట్ సంస్థలకు ఎలా చేరిందని ఆయన ప్రశ్నించారు. తప్పులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తే తనపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. సామాజిక కార్యకర్తగా, టెక్నికల్ అంశాలు తెలిసిన వ్యక్తిగా తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఏపీలో దొంగ ఓట్లపై ప్రశ్నించినట్టు చెప్పారు. తాను ఈ విషయమై ఫిర్యాదు చేసిన సమయం నుండి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. అరగంట పాటు పచ్చి బూతులు తిడుతూ ఏపీ పోలీసులు తనను బెదిరించారని ఆయన తెలిపారు. అంతేకాక తనకు ప్రాణహాని కూడా ఉందన్నారు. తనకు రక్షణ కల్పించాలని తెలంగాణ పోలీసులను ఆశ్రయించినట్టుగా లోకేశ్వర్ రెడ్డి చెప్పారు.