లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి మార్పులు ఉండవు

SMTV Desk 2019-03-02 11:00:51  Sunil Arora, Lok Sabha Elections, Election Commission, No Changes

న్యూఢిల్లీ, మార్చి 2: ఇండియా-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి మార్పులు ఉండవని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలపై ఆ ప్రభావం పడదని, ఎన్నికల షెడ్యూలులో ఎటువంటి మార్పు ఉండదని, అనుకున్న ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలు సజావుగా సాగే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.

ఎన్నికల ఏర్పాట్ల మేరకు రెండు రోజులుగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సునీల్ అరోరా పర్యటిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థులు స్వదేశంతోపాటు విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. వారిచ్చిన సమాచారాన్ని ఐటీ విభాగం నిర్ధారిస్తుందని, తేడాలుంటే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపేందుకు ఈసీ కట్టుబడి ఉందన్న అరోరా, ఉద్వేగ, రెచ్చగొట్టే ప్రసంగాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.