భారత పైలట్ అభినందన్‌పై వీణామాలిక్ ట్వీట్; కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ నటి

SMTV Desk 2019-02-28 18:55:21  veena malik, pakistan model, abhinandhan

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 28: ఒకవైపు పాకిస్తాన్‌కి చిక్కిన భారత పైలట్ అభినందన్ క్షేమంగా తిరిగి భారత్ రావాలని ఇరు దేశాల సినిమా నటులు కాంక్షిస్తుంటే మరో వైపు పాకిస్తాన్ నటి వీణా మాలిక్ ఈ విషయంపై వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘‘మీరు ఇప్పుడిప్పుడే వచ్చారు.... మీకు ఆతిథ్యం బాగుంటుంది..’’ అంటూ తన ట్విట్టర్ వేదికగా వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.

ఈ ట్వీట్‌కి వెంటనే బాలివుడ్ నటి స్వర భాస్కర్ దీటుగా బదులిచ్చారు. ‘‘వీణా జీ... మీ సంకుచితమైన బుద్ధికి నేను సిగ్గుపడుతున్నాను.. మీ ఆనందం క్షణికమే. మా ఆఫీసర్ హీరో, ధైర్య సాహసాలు కలిగిన జవాన్’’ అని ట్వీట్ చేశారు. అభినందన్‌ని పాక్ జవాన్లు అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా ఆయన ముఖంలో ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదని స్వర భాస్కర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.