చేవెళ్ల ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన మంత్రి మల్లారెడ్డి...

SMTV Desk 2019-02-28 17:43:03  Chevella MP Seat, TRS, Minister mallareddy, Loksabha elections

రంగారెడ్డి, ఫిబ్రవరి 28: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తులు చేస్తున్న సమయంలో మంత్రి ఏకంగా ఓ ఎంపీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు. ఈ ప్రకటన రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రంగారెడ్డి జిల్లా నుండి మంత్రివర్గంలో చేరిన మల్లారెడ్డి ఆ జిల్లాకు సంబంధించిన వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చేవెళ్ల ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించారు. మాజీ మంత్రి, తాండూరు నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఫోటీ చేసి ఓటమిపాలైన పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల ఎంపీగా పోటీ చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఎంపీగా ఆయన విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోందని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2014 లో టీఆర్ఎస్ పార్టీ తరపున చేవెళ్ల ఎంపీగా ఎన్నికైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి మోసం చేశారని మంత్రి ఆరోపించారు. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ భవిష్యత్ ఇచ్చిన టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారని గుర్తుచేశారు. ఆయనకు అసలు రాజకీయాలంటే ఏంటో తెలియదన్నారు. కాబట్టి చేవెళ్ల ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో మహేందర్ రెడ్డిని గెలిపించి మరోసారి టీఆర్ఎస్ పక్షాన నిలవాలని మల్లా రెడ్డి సూచించారు.