‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' గురించిన వర్మ ట్విటర్‌ పోస్ట్

SMTV Desk 2019-02-28 16:22:08  Ram gopal varma , lakshmi, NTR

హైదరాబాద్, ఫిబ్రవరి 28: సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ తెరకెక్కించిన బయోపిక్‌లో చూపించని ఎన్నో ఈ నిజాలు ఈ సినిమాలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆడియన్స్‌.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ కూడా భారీగా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు మంచి లాభాలకు వర్మ సినిమాలను అమ్మేసినట్టుగా టాలీవుడ్‌ సర్కిల్స్‌ లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన వర్మ సోషల్‌ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.

"లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు సంబంధించి గమనిక లక్ష్మీస్ ఎన్టీఆర్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో ఖరీదుకి కొనుక్కున్నారు అని వస్తున్న రకరకాల వార్తల్లో నిజాలు లేవు ...ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు Gv films , RGV మరియు రాకేష్ రెడ్డిలు త్వరలో అప్డేట్ చేస్తారు" అంటూ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను మార్చి 15న రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్‌ ప్లాన్ చేస్తుంది.