రైల్వే జోన్ ఇచ్చినందుకు వైసీపీ సంబరాలు చేసుకుంటుంది

SMTV Desk 2019-02-28 10:08:52  Chandrababu Naidu, Tele Conference, TDP, Leaders, YCP, Vishakha Railway

అమరావతి, ఫిబ్రవరి 28: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వైసీపీ అధినేత వైఎస్ జగన్, మరోసారి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసేందుకు కుట్రలు పన్నారని విమర్శించారు. ఎన్నికల నోటిఫికేషన్ కొద్ది రోజుల ముందే హడావుడిగా రైల్వే జోన్ ను ప్రకటించారని ఆరోపించారు. ఈ ఉదయం పార్టీ నేతలతో, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్ మసిబూసిన మారేడుకాయ వంటిదని ఎద్దేవా చేశారు. ఏపీకి తక్కువ ఆదాయం వచ్చేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. విభజన హామీల అమలుపై శుక్రవారం నాడు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని, ఈ కార్యక్రమంలో ప్రతి టీడీపీ కార్యకర్త పాల్గొనాలని ఆదేశించారు. రైల్వే జోన్ ఇచ్చినందుకు వైసీపీ సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. కేంద్రం చేసిన మోసాన్ని ఆ పార్టీ కప్పిబుచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.