నీటిలో శవమై తేలిన ఆరు నెలల పసికందు

SMTV Desk 2019-02-27 13:28:07  Andhra Pradesh, Srirangaraja puram

ఆంద్రప్రదేశ్, ఫిబ్రవరి 27: శ్రీరంగరాజపురం మండలం పిల్లిగుండ్లపల్లె ఒంటిల్లులో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆరు నెలల పసికందును దారుణంగా హతమార్చారు. పోలీసులు కథనం మేరకు పిల్లిగుండ్లపల్లె ఒంటిల్లుకు చెందిన భువనేశ్వరి(22), వై.వినోద్‌కుమార్‌(27) మూడేళ్ళ క్రితం ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరి మాన పిల్లలు సంతానం. రెండో బిడ్డ పుట్టాక భువనేశ్వరిని తల్లిదండ్రులు చేరదీసారు.

దాంతో ఇద్దరు బిడ్డలతో కలిసి అమ్మగారిల్లు అయిన పిలిగుండ్లపల్లె ఒంటిల్లుకు వచ్చింది. సమీప బంధువు చనిపోవడంతో భువనేశ్వరి తల్లిదండ్రులు ఆ అంత్యక్రియలకు వెళ్లారు. దాంతో తన అక్క రేవతితో కలసి మంగళవారం ఇంట్లోనే ఉన్నారు. వరండాలోని ఊయలలో ఆరునెలల మగబిడ్డను నిద్రపుచ్చి.. తాము కూడా పెద్ద కుమారుడు లాలూలోహన్‌(3)తో కలిసి నిద్రపోయారు. కొంతసేపటికి భువనేశ్వరికి మెలకువ వచ్చి చూసేసరికి ఊయలలో బిడ్డ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా కనిపించలేదు. బంధువులకు విషయం తెలిసి వారూ గాలించారు. చివరకు నీళ్ల డ్రమ్‌ మూత తీయగా అందులో బిడ్డ శవమై కనిపించాడు. పనిమీద చిత్తూరులో ఉండిన వినోద్‌కుమార్‌కు విషయం తెలిసి హుటాహుటిన గ్రామానికి చేరుకున్నాడు.

స్థానికుల సమాచారం మేరకు పుత్తూరు డీఎస్పీ సౌమ్యలత, కార్వేటినగరం సీఐ చల్లనిదొర, ఎస్‌ఆర్‌పురం ఎస్‌ఐ వి.సుమన్‌, ఏఎస్‌ఐలు సయ్యద్‌ అహ్మద్‌,గోపి, తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. ఎస్‌ఐ సుమన్‌ మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు చెప్పారు.