బాబును ముఖ్యమంత్రి అంటారా లేక ముఖ్యకంత్రి అంటారా: జగన్

SMTV Desk 2017-08-03 19:07:51  Namdyala YCP meeting, YCP Namdyala, Jagan about AP CM, YCP namdyala By-polls, YS Jagan about AP CM

నంద్యాల, ఆగష్టు 3: మామకు వెన్ను పోటు పొడవడం, కాపు కులస్థులకు వెన్ను పోటు పొడవడం, నంద్యాల ఉపఎన్నిక సమయానికి పవన్ కల్యాణ్ ని పిలవడం, ఎప్పటికప్పుడు నాటకాలు వేయడం, ఇచ్చిన హామీలు గాలికి వదిలేయడం, మైనార్టీలను మోసగించడం, ఇదీ బాబు గారి నైజం అంటూ వైకపా అధినేత జగన్ నిప్పులు చెరిగారు. ఒక్క అబద్ధం కూడా ఆడకపోతే సత్యహరిశ్చంద్రుడు అని, ఒక్క నిజం కూడా చెప్పకపోతే చంద్రబాబు అని అంటారనీ, బాబును ముఖ్యమంత్రి అంటారా? ముఖ్యకంత్రి అంటారా? అంటూ ఘాటుగా విమర్శించారు. గతంలో కర్నూల్ జిల్లాకు ఇచ్చిన హామీలను గాలికి వదిలిన చంద్రబాబు, ఇప్పుడు నంద్యాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఎవ్వరూ అనుకోరని అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనతో బాబు పాలనను పోల్చలేమని, చంద్రబాబు పాలన దిక్కుమాలిన పాలన, వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ప్రజా పాలన అంటూ ఘాటుగా స్పందించారు. ముస్లింలు ఎన్నికల సమయంలో మాత్రమే బాబుకు గుర్తుకువస్తారని, తెదేపా కేబినెట్ లో ఒక్క మైనార్టీ వ్యక్తి కూడా లేకపోవడం దారుణమని అన్నారు. చంద్రబాబు కొడుకుని ఎమ్మెల్సీ అయిన మూడు రోజుల్లో కేబినెట్‌లోకి తీసుకుంటారు, అదే ముస్లిం సోదరులకు మాత్రం కేబినెట్‌లో స్థానం ఉండదు అంటూ జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.