పాక్ నటులకు వీసా రద్దు చేయాలి: ఏఐసీడబ్ల్యూఏ

SMTV Desk 2019-02-27 13:00:53  Pakistan actors visa, AICWA, Narendra Modi

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: భారత్ లో పాకిస్తాన్ కి నిరసన తెలుపుతూ అఖిల భారత సినీ వర్కర్ల సంఘం (ఏఐసీడబ్ల్యూఏ), ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఈ లేఖలో సినీ, మీడియా రంగాలకు చెందిన పాకిస్తాన్‌ నటులెవరికీ ఎలాంటి వీసా జారీ చేయకుండా పూర్తి నిషేధం విధించాలని ఏఐసీడబ్ల్యూఏ కోరింది.

పాకిస్తాన్ లో భారత సినిమాలు, వాణిజ్య ప్రకటనలను ఆ దేశం నిషేధించింది. ఇందుకు ప్రతిచర్యగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఏఐసీడబ్ల్యూఏ తెలిపింది. పుల్వామా ఉగ్రదాడుల నేపథ్యంలో పాక్‌కు ధీటైన జవాబిచ్చేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలకు తమ సంఘం పూర్తి అండగా నిలుస్తుందని ఏఐసీడబ్ల్యూఏ పేర్కొంది.

పాకిస్తాన్‌ వంటి ఉగ్రవాద సంస్థలకు అండగా నిలిచే దేశాలపై కఠిన నియంత్రణలు విధించాలని, ఉగ్ర కుట్రలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌తో మీ పోరాటానికి 130 కోట్ల మంది ప్రజలు మద్దతుగా నిలిచారని వెల్లడించింది. దేశ ప్రయోజనాలే అంతిమ లక్ష్యంగా పాక్‌ నటులకు వీసా నిరాకరిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించాలని ఏఐసీడబ్ల్యూఏ కోరింది.