ఇండియన్ ఎయిర్ ఫోర్సు గురించి పాకిస్తానీల వెతుకులాట

SMTV Desk 2019-02-27 10:25:00  pakistan, India, Indian Air Force, Miraj 2000, Google search

పాకిస్తాన్, ఫిబ్రవరి 27: భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ తో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడితో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో భారత్ వైమానిక దాడుల అంశం ట్రెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రజలు సైతం ఇంటర్నెట్ లో ఎక్కువగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి వెతుకుతున్నారట. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కంటే భారత వాయుసేన గురించి తెలుసుకోవడానికి ఎక్కువ మంది పాకిస్థానీలు ఆసక్తి చూపినట్టు వెల్లడైంది.

మిరేజ్-2000 ఫైటర్ జెట్ విమానాలు తిరుగులేని కచ్చితత్వంతో జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ పాకిస్థాన్ ప్రజలను సైతం విస్మయానికి గురిచేసినట్టు గూగుల్ ట్రెండ్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అర్థరాత్రి చీకట్లో గురితప్పకుండా దాడిచేయడం పట్ల పాక్ సైన్యం కూడా దిగ్భ్రాంతికి గురైనా పైకి మాత్రం గంభీరంగా ప్రకటనలిస్తోంది. భారత్ జరిపిన ఈ దాడులు పాకిస్థాన్ మీడియాలో కూడా ప్రధాన అంశంగా మారాయి. ఎక్కడ చూసినా సర్జికల్ స్ట్రయిక్స్, బాలాకోట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎల్వోసీ, పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ అనే పదాలు సెర్చ్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.