నంద్యాల ఉపఎన్నికల్లో ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర: జగన్

SMTV Desk 2017-08-03 18:34:16  YCP Namdyala, Jagan about AP CM, YCP namdyala By-polls, YS Jagan about AP CM

నంద్యాల, ఆగష్టు 3: నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ఏపీ మంత్రులంతా నంద్యాల నడిరోడ్లపైనే తిరుగుతున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హాస్యం చేశారు. ఈ రోజు జరిగిన వైసీపీ భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ...చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఇక్కడి రోడ్లపైనే తిరుగుతున్నారని తెలిపారు. వీళ్లిద్దరూ కలిసి అబద్ధపు హామీలు ఇస్తున్నారని, మోసపూరిత జివోలు చేస్తున్నారని ఆరోపించారు. నంద్యాల ఎన్నిక ఏకగ్రీవం అని మేం అంటే, చంద్రబాబు నంద్యాల నియోజకవర్గ అభివృద్దికి ఒక్క రూపాయి అయినా విడుదల చేసే వారా అని ప్రశ్నించారు. నంద్యాల ఉపఎన్నిక ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి జరుగుతున్న యుద్ధమిది అన్నారు. విశ్వసనీయ రాజకీయాలకు, వంఛనతో కూడిన రాజకీయాలకు జరుగుతున్న పోరాటమన్నారు. దుర్మార్గపు పాలన చేస్తున్న చంద్రబాబు పాలనపై చేస్తున్న యుద్ధం ఈ ఉపఎన్నిక అని జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో బాబు దోచుకున్న అవినీతి డబ్బుల్లో కొంత జనాలలో జల్లి, అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలవాలని ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. 2019లో జరగబోయే కురుక్షేత్ర మహా సంగ్రామానికి నాంది నంద్యాల ఉపఎన్నిక అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆయుధం పట్టక్కర్లేదు, ప్రజలెవ్వరూ యుద్దం చేయక్కర్లేదు, ఈ ఎన్నికల్లో ప్రజలు వారి చూపుడు వేలుతో ఓటు అనే విష్ణు చక్రాన్ని తిప్పుతూ, చంద్రబాబు నాయుడి కౌరవ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా కూల్చి వేయాలి అని జగన్ నంద్యాల ప్రజలకు పిలుపునిచ్చారు.