పాకిస్థాన్ నుంచి ఖాళీగా తిరిగొచ్చిన లాహోర్-ఢిల్లీ ఎక్స్ ప్రెస్

SMTV Desk 2019-02-26 17:37:36  pakistan, delhi-lahore express, delhi-atari express, pakistan train

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: పుల్వామా ఘటన తర్వాత ఢిల్లీ-లాహోర్ ల మధ్య తిరిగే సంఝౌతా ఎక్స్ ప్రెస్ పరిస్థితి ఓ బాధితురాలిగా తయారైంది. ఈ రోజు పాకిస్థాన్ నుంచి ఈ రైలు ఖాళీగా తిరిగొచ్చింది. ఢిల్లీ-అటారీ ఎక్స్ ప్రెస్ గా పిలవబడే ఈ రైలు గురించి రైల్వే శాఖ ఈరోజు మాట్లాడుతూ, కనీసం వంద మంది ప్రయాణికులు కూడా ఈరోజు రైల్లో రాలేదని తెలిపింది.

ఈ రైల్లో ఆరు స్లీపర్ కోచ్ లు, ఒక ఏసీ 3టైర్ కోచ్ ఉన్నాయి. ఈరోజు లాహోర్ నుంచి సరిహద్దు వద్ద ఉన్న పంజాబ్ లోని అటారీ రైల్వే స్టేషన్ కు సంఝౌతా ఎక్స్ ప్రెస్ చేరుకుంది. కొంత మంది ప్రయాణికులు మినహా అన్ని కోచ్ లు ఖాళీగానే కనిపించాయి. వాస్తవానికి ఒక ప్రయాణంలో (అటు నుంచి ఇటు... ఇటు నుంచి అటు వైపు) వెయ్యికి పైగా ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణిస్తుంటారు.

ఈ రోజు మాత్రం కేవలం దాదాపు వంద మంది ప్రయాణికులతో మాత్రమే రైలు వచ్చింది. ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి బుధ, ఆదివారాల్లో రాత్రి 11.10 గంటలకు రైలు లాహోర్ కు బయల్దేరుతుంది. లాహోర్ నుంచి ప్రతి సోమ, గురువారాల్లో తిరుగుపయనమవుతుంది. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో ఈ రైలు సేవలను ప్రారంభించారు. ఈ తెల్లవారుజామున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడుల నేపథ్యంలో, ప్రయాణికుల సంఖ్య మరింత పడిపోయే అవకాశం ఉంది.